విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదం
వర్గల్(గజ్వేల్): విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం పెంపు ధ్యేయంగా వర్గల్ మండలం గౌరారం కావేరి యూనివర్సిటీ గురువారం ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో 2026–27 విద్యా సంవత్సరానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను వైస్‌ఛాన్సలర్ డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక, సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ, వర్క్‌షాప్‌లు, పరిశ్రమ ఆధారిత సర్టిఫికేషన్, కెరీర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వర్సిటీలో చివరి సంవత్సరం విద్యార్థులకు నియామక ప్రక్రియలు, పరిశ్రమ విధానాలు, కార్యాలయ అంచనాలు, కార్పొరేట్ సంస్కృతిపై అవగాహన కల్పించనున్నారు.
అధ్యాపకుల కోసం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, పరిశ్రమ సందర్శనలు చేపట్టనున్నారు. వీటి ద్వారా ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమల నైపుణ్య అవసరాలపై అవగాహన పెరుగుతుంది. విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధమైన పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, టాస్క్‌తో భాగస్వామ్యం విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మధ్య వారధిని బలోపేతం చేస్తుందని వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, పోల్సాని హర్షరావు, శిక్షణ, ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ విశ్వప్రకాశ్‌బాబు, టాస్క్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


