రాలుతున్న పూత, గూడ
● జిల్లాలో అత్యధికంగా పంట సాగు
● దిగుబడులపై తీవ్ర స్థాయిలో ప్రభావం
● నేలలో తేమ శాతం తగ్గడమే కారణం
ఎల్‌నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొంది. వాతావరణంలో వచ్చిన మార్పులు, భూమిలో తేమశాతం తగ్గడం, తదితర కారణాలతో పత్తి పంటలో పూత, గూడ రాలుతోంది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చినుకు జాడ లేకపోవడం, వేసవిని తలపిస్తుండటంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గింది. – సంగారెడ్డి జోన్
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3,65,000 ఎకరాల్లో పత్తి పండిస్తారని తెలిపారు. అయితే ఎల్‌నినోతో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత 20 రోజులుగా వరుణుడి జాడ లేకపోవడంతో పాటు ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భూమిలో తేమశాతం తగ్గిపోయి పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పత్తి పూత, గూడ(కాత) దశలో ఉంది. సరైన నీటి లభ్యత, పోషకాలు లభించకపోవడంతో పాటు వాతావరణంలో మారుతున్న పరిస్థితులకు ఎండిపోయి పూత, గూడు రాలుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న పెట్టుబడి
గత 15 ఏళ్లుగా జిల్లాలోని జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, మొగుడంపల్లి, మునిపల్లి, సదాశివపేట, మనూర్, నాగలగిద్ద, నారాయణఖేడ్ తదితర మండలాల్లో ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో పత్తి సాగు తగ్గించుకొని ఇతర పంటలు వేశారు. గతంలో కంటే ఈ సంవత్సరం సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణం పత్తి పంట సాగు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ఎకరా పత్తి సాగుకు సుమారు రూ.60 నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కండ్ల ముందే పూత రాలిపోతుండడంతో ఆకాశం వైపు వర్షం కోసం దీనంగా చూస్తున్నారు. ఒక మొక్కకు కనీసం పదిలోపే పత్తి కాయలు ఉంటున్నాయి. పంట దిగుబడిపై ప్రభావం చూపి కనీసం పెట్టుబడి ఖర్చులైనా వస్తాయో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు అధికారుల సూచన మేరకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.


