స్వచ్ఛందంగా కూల్చివేసుకుంటున్న యజమానులు
● మూడు అంతస్తుల వరకు తొలగింపు
● 40 ఫీట్ల వంతున సాగుతున్న విస్తరణ
● పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం
జహీరాబాద్: పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే హనుమాన్ మందిర్, భవానీ మందిర్ రహదారులను విస్తరించే పనులకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. దీంతో వ్యాపారులు, ఇండ్ల యజమానులు వారం రోజుల గడువు కోరగా అధికారులు సమ్మతించారు. ఇచ్చిన గడువు ముగియడంతో యజమానులు ఎవరికి వారు స్వచ్ఛందంగా భవనాలను కూల్చివేసుకుంటున్నారు. అధికారులు 40 ఫీట్ల రోడ్డు వెడల్పుతో మార్కింగ్ ఇవ్వగా, ఆ మేరకు కూల్చివేతలు చేపట్టారు. హనుమాన్ మందిరం రహదారిపై ఆక్రమణలను ఎవరికి వారు కూల్చివేసుకునే పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. అధికార యంత్రాంగం జేసీబీలతో కూల్చివేస్తే కట్టడాలు దెబ్బతింటాయని, మార్కింగ్ చేసి గుర్తించిన ప్రదేశం వరకు తొలగించుకుంటామని వ్యాపారులు, యజమానులు ఇచ్చిన హామీ మేరకు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు.
మందకొడిగా పనులు
మూడు అంతస్తుల భవనాలు ఉన్న వారు సైతం రహదారి వైపు ఉన్న కట్టడాలను కుల్చివేసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాపారులు షటర్లను సైతం తొలగించుకున్నారు. అయితే భవానీ మందిర్ రహదారిపై మాత్రం పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఆక్రమణలను తొలగించుకునే పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వ్యాపారులు, ఇండ్ల యజమానుల్లో చలనం రాకుంటే ఇక మున్సిపల్‌శాఖ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకునే శిథిలాలను మున్సిపల్ శాఖ ఇతర ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసింది. రాజకీయ ఒత్తిడులను పక్కన పెట్టి ప్రజల వైపు నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధికారులు రంగంలోకి దిగారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గితే ప్రజల వైపు నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉండడంతో బహిరంగంగా ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. రెండు రహదారుల విస్తరణ పనులతో పాటు అధికంగా రద్దీగా ఉండే లతీఫ్ రోడ్డు, బ్లాక్ రోడ్డు విస్తరణ పనులను సైతం త్వరలో చేపట్టే అవకాశం ఉంది. ఆయా రహదారులు ఆక్రమణలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు గుర్తించారు. మూడు దశాబ్దాలుగా ఎదర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తీరుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును అభినందిస్తున్నారు.


