శివ్వంపేట(నర్సాపూర్): శివ్వంపేటలోని ఓం సాయి వెంకటరమణ రైస్‌మిల్‌లో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2022– 23 రబీ సీజన్‌లో ప్రభుత్వం ఈ మిల్లుకు 6,996 టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. అయితే, మిల్లులో నిల్వలను పరిశీలించగా 241 టన్నుల ధాన్యం (సుమారు 6,026 బస్తాలు) తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేటాయించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లులో తగినంత గోదాం సదుపాయం లేకపోవడంతో ఆరుబయట నిల్వ చేయాల్సి వచ్చిందని యజమానులు తెలిపారు. ఈ క్రమంలో వర్షాలకు వడ్ల బస్తాలు తడిసి పాడైపోవడంతో పాటు, కోతుల బెడద కారణంగా ధాన్యం నష్టం వాటిల్లిందని అధికారులకు వివరించారు. తక్కువగా వచ్చిన 241 టన్నుల ధాన్యం విలువ రూ. 53,91,000 ప్రభుత్వానికి రికవరీ కింద చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. స్పందించిన మిల్లు యజమానులు ఆ మొత్తాన్ని చెల్లిస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మెదక్ సివిల్ సప్లయి ఆర్‌ఐ నర్సింలు, హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.


