నామినేటెడ్‌ పదవులెవరికో? | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవులెవరికో?

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

మంత్రి ఇలాకాలో వీడని సస్పెన్స్‌

మంత్రి హామీలు ఉత్తవేనా?

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్‌లోని కోహెడలో నామినేటెడ్‌ పదవుల భర్తీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా.. అత్యంత కీలకమైన కోహెడ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవి భర్తీ కాకపోవడంతో స్థానిక అధికార పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్వయంగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సొంత ఇలాకాలోనే నిర్ణయాలు ఇంత ఆలస్యమైతే, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్‌ మీడియా వేదికగా బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేసి, బయోడేటాలు ఇచ్చి అలిసిపోయామని, క్యాడర్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

ఇంకెంత కాలం!

కోహెడ సొసైటీ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలా? లేక ఎస్సీలకే ఇవ్వాలా? అనే అంతర్గత వివాదమే ఈ సుదీర్గ జాప్యానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే మంత్రి నియోజకవర్గంలో సామాజిక సమీకరణల పేరుతో కాలయాపన చేస్తూ నిర్ణయాన్ని నానబెట్టడంపై ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ కోసం రాత్రింభవళ్లు కష్టపడిన మాజీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్యతో పాటు మాజీ సర్పంచ్‌లు, సీనియర్‌ నేతలు ఈ పదవి కోసం వేచి చూస్తున్నారు. నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ఇది పొలిటికల్‌ అస్త్రంగా మారుతుందని నియోజకవర్గ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.

కోహెడ సహకార సంఘం కార్యాలయం

కోహెడ సింగిల్‌ విండో పదవిపై కాలయాపన

సమీకరణాల సాకుతో నానబెడుతున్న వైనం

మంత్రి చుట్టూ క్యాడర్‌ ప్రదక్షిణలు

పాలక మండళ్లు లేక రైతుల ఇబ్బందులు

ఒక వైపు రాజకీయ లాబీయింగ్‌, పైరవీలు నడుస్తుంటే మరోవైపు పాలక మండళ్లు లేకపోవడంతో సొసైటీల్లో రైతుల సమస్యలు గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎరువుల పంపిణీ, పంట రుణాలు మంజూరు వంటి కీలక నిర్ణయాలు సకాలంలో జరగక క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు పార్టీ విజయానికి తోడ్పడిన నిఖార్‌సైన గ్రౌండ్‌ లెవల్‌ కార్యకర్తలను కాదని కేవలం పైరవీలకే పెద్దపీట వేస్తారేమోనన్న అనుమానాలు కార్యకర్తల్లో బలంగా నాటుకుంటున్నాయి. మంత్రి గతంలో కార్యకర్తలతో భేటీ అయినప్పుడు కష్టపడిన వారికే న్యాయం జరుగుతుంది, ఎవరూ అధైర్యపడొద్దు అని హామీ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement