కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ శివారులో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఫిబ్రవరి 1,2,3వ తేదీల్లో మహా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఆహ్వాన పత్రికను మంగళవారం తమిళనాడు కాంచీపురంలోని మణిమండపంలో చతుర్మాస దీక్షలో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి క్షేత్ర నిర్వహణ కమిటీ అందించింది. మహా పట్టాభిషేక నిర్వహణ కార్యక్రమాల్లో పాటించే పద్ధతులు, చేపట్టాల్సిన పనులపై తగు సూచనలు చేసి, కమిటీని ఆశీర్వదించారు. పీఠాధిపతిని కలిసిన వారిలో క్షేత్రం నిర్వాహకులు హరినాథ శర్మ, సర్పంచ్ బాలరాజు, కమిటీ సభ్యులు మోహనకృష్ణశర్మ, రాజేంద్రప్రసాద్, సత్యం, తిరుపతిరెడ్డి ఉన్నారు.
సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌లో అనభేరి విగ్రహాన్ని పున:నిర్మించాలని, వీర మరణం పొందిన మహ్మదాపూర్ గుట్టలను పర్యటక కేంద్రం చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సాయుధ పోరాట 78వ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశపాలనలో.. అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి పేదలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారన్నారు. కార్యక్రమంలో మల్లేశ్, స్వామి, అశోక్, శ్రీనివాసు, కళ్యాణ్, సృజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి(తూప్రాన్): బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మాసాయిపేట్ మండలం హకీంపేట్ గ్రామ శివారులోని డ్యామ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూదం ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, వినోద్, మల్లబోయిన గణేశ్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి క్రైమ్: ఆటో అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పోలీసు స్టేషన్ ఫరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని బైపాస్ స్థానిక సాయి బాబాగుడి దగ్గర వద్ద ఆటో అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.


