కొల్చారం(నర్సాపూర్): నదిలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోణాపూర్ గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ హైమద్ మోహీనొద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి భిక్షపతి(40)ఈనెల 13న సాయంత్రం చేపల వేటకని గ్రామ శివారులోని మంజీరా నది వద్దకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడతో నది వద్దకు వెళ్లి చూడగా భిక్షపతి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందితో నదిలో వెతికించగా భిక్షపతి మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గుర్తుతెలియని యువకుడి మృతదేహం
నారాయణఖేడ్: మనూరు మండలం రాయిపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు వివరాల ప్రకారం.. సుమారు 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఒంటిపైన నల్లటి రంగు టీ షర్టు, మెరూన్ కలర్ డ్రాయర్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిస్తే మనూరు పోలీస్‌స్టేషన్ 87126 56758 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


