కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం.. అంకిరెడ్డిపల్లికి చెందిన రాసుల శ్రీకాంత్(25) ఓ ప్రైవేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య చవితి పండుగకు పుట్టింటికి వెళ్లగా భార్యకు ఫోన్ చేసి గొడవపడి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అంకిరెడ్డిపల్లి నుంచి దుద్దెడ గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పండుగ ఫూట కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేశారు.
కారు ఢీకొని..
సిద్దిపేటఅర్బన్: కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల దాబా వద్ద ఓ వ్యక్తి డివైడర్ దాటి కింగ్ ప్యాలెస్ హోటల్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు సమీపంలోని హోటల్‌లో పని చేసే వ్యక్తిగా తెలుస్తోందని, పూర్తి వివరాలు తెలియలేదని సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు పేర్కొన్నారు.


