కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని చౌకన్‌పల్లి శివారులో కాలువిరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న జింకపిల్లను స్థానిక యువకులు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే గాయపడిన జింకపిల్లను స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా.. ఎల్‌ఎస్‌ఏ వైద్యులు బస్వయ్య స్వామి ప్రథమ చికిత్స చేసి ఇంజెక్షన్ అందజేశారు. అనంతరం సిర్గాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాముకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని జింకపిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ జింకపిల్లకు మరింత మెరుగైన వైద్యం అందించి నారాయణఖేడ్ పార్కులో వదిలిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంతి శ్రీనివాస్, యువకులు పాల్గొన్నారు.


