న్యాల్‌కల్(జహీరాబాద్): న్యాల్‌కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామ శివారులో రాత్రి రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం లభ్యమైంది. మృతుడు నీలం రంగు షర్టు, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వికారాబాద్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 7702629707 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
రామచంద్రాపురం (పటాన్‌చెరు): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 14న సదరు వృద్ధుడు రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా చెరువు మట్టి తరలింపు
జేసీబీ, ట్రాక్టర్లు స్వాధీనం
కొండపాక(గజ్వేల్): అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ, 2 ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దుద్దెడలోని చెరువులోంచి ఈనెల 4న అక్రమంగా మట్టిని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది వెళ్లి జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జేసీబీకి రూ. 5వేలు, ఒక్కొక్క ట్రాక్టరుకు రూ. 2 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్ల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలను అప్పగించామని పేర్కొన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): భార్యతో గొడవపడి జీవితంపై విరక్తి చెందిన యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్ద శంకరంపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ. ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాయికాడి భాస్కర్ (39) ఆదివారం రాత్రి తన భార్యతో కుటుంబ సభ్యుల విషయంలో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం పట్టణ శివారులోని రేగోడుకు వెళ్లే రహదారిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్ స్వర్ణకార వృత్తి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య దీప, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


