పాపన్నపేట(మెదక్): మండల పరిధి చిత్రియాల్ గిరిజన తండాలో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్‌లో ఇనుప పైపులు వేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్ గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్ (35) ట్రాక్టర్ నడుపుతూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం చిత్రియాల్ తండాలోని లక్ష్మణ్ వద్ద కూలీ పనుల కోసం వెళ్లాడు. అక్కడ షెడ్డు నిర్మాణం కోసం ఇనుప పైపులు తీసి ట్రాక్టర్‌లో వేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఆ ఇనుప పైపులు తగిలాయి. దీంతో పుట్టల కుమార్‌కు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కంది/సంగారెడ్డి క్రైమ్: నాలుగు ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కంది మండలం జుల్కల్‌కి చెందిన కావలి బాల్‌రాజ్ (24) గ్రామంలో టైర్ షాప్ నిర్వహిస్తూ నివాసం ఉంటున్నాడు. 2025 జూన్‌లో ఓ నలుగురేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడగా, బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయవాదులు, పోలీసు సిబ్బందిని, భరోసా కేంద్రాన్ని ఎస్పీ అభినందించారు.
మార్షల్‌ఆర్ట్స్‌లో అవార్డులు
సిద్దిపేటజోన్: హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎక్స్‌లెన్‌న్స్ ఐకాన్ 2026లో సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు మార్షల్ ఆర్ట్స్‌లో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పాల్గొన్న టోర్నీలో జిల్లాకు చెందిన కరాటే మాస్టర్ సాజిద్ పాషా గోల్డెన్ నంది అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన శిష్యులు శిఖ, ఎల్లాగౌడ్, ప్రభాకర్, మల్లేశం, నవీన్, అస్మా, హరి, అలీ, రేవంత్, శ్రీరాం, రవళి కావ్యలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి.
రాష్ట్ర పోటీలకు గురుకుల విద్యార్థులు
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పి.నర్సింహ్మచారి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ోటిలింగాలలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 8 మంది పాల్గొనగా వర్షిత్, హర్షవర్ధన్, జస్వంత్, వైష్ణో ఆర్యన్, మనోజ్, అభి ఎంపికయ్యారని చెప్పారు.
నకిలీ పత్రాలతో ఆస్తుల విక్రయం
మూసాపేట: తల్లిదండ్రులకు తానే నిజమైన వారసుడినని నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించారని సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉండే ఉన్నం వెంకటేశ్వర్లు, పార్థసారథి తల్లిదండ్రులైన ఉన్నం సుబ్బానాయుడు, అచ్చమ్మలు అమీన్పూర్, బీరంగూడలో సర్వే నం.967లో 1,200 గజాలు కొనుగోలు చేశారు. 2013లో అచ్చమ్మ, 2017లో సుబ్బానాయుడు మరణించారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం తహశీల్దార్ జారీ చేశారు. అయితే వెంకటేశ్వర్లు తల్లిదండ్రుల స్థలాలను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా...ఆ స్థలాలపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2018లో శ్రీనివాస్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందినట్లు తెలిసింది. సుబ్బానాయుడు, అచ్చమ్మలు తమ తల్లిదండ్రులేనని నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని విక్రయించారని, అసలైన వారసులం తామేనని వెంకటేశ్వర్లు, పార్థసారథి ఫిర్యాదు చేశారు.


