సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు 73 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.699.895 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఈనెల 5న జీవోనం.164 జారీ చేసింది. ఈ జాబితాలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.9.62 కోట్ల అంచనావ్యయం కేటాయించారు. హుస్నాబాద్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతులు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు హుజూరాబాద్‌కు మార్గంలో ఎదురవుతున్న ఇబ్బందులు హైలెవల్ బ్రిడ్జి మంజూరుతో తీరనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ సుందరగిరి రహదారిపై కిలో మీటర్ 10/022 వద్ద హైలెవల్ బ్రిడ్జి (10 మీటర్ల వెడల్పు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి సోమవారం వెల్లడించారు. ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. హైలెవెల్ బ్రిడ్జి మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.


