నషాముక్త్ యువ భారత్‌లో.. లకుడారం జీపీకి రెండో స్థానం
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో సర్పంచ్ శిల్ప యువత మత్తు పదార్థాల బారిన పడితే కలిగే నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి సఫలీకృతురాలైంది. కాగా నషా ముక్త్ యువభారత్ వికసిత్ భారత్ విజేతల్లో లకుడారం గ్రామ పంచాయతీ 2026 ఆగస్టు పోటీల్లో దేశవ్యాప్తంగా ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. హర్యానా రాష్ట్రంలో నీర్పూర్ గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రుల క్షోభకు గురి చేసే విషయాలపై గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పిల్లలు మానుకునేలా సర్పంచ్ శిల్ప తల్లిదండ్రులకు అండగా నిలిచారు. దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీల్లో లకుడారం పేరును దక్కించుకుంది. నిరంతరం ఇలాంటి ఆదర్శమైన పనులు చేస్తూ మరిన్ని బహుమతులు అందుకోవాలని నషాముక్త్ యువభారత్ ఆకాంక్షించింది. ఈ సందర్భంగా సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో నషా మక్త్ యువ భారత్ పోటీల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. ఇలాగే సహాయ సహకారాలుంటే మరిన్ని ఆదర్శమైన బహుమతులు అందుకుంటూ, గ్రామ పేరు ప్రతిష్టలను పెంచుతామన్నారు. బహుమతిని గెలుచుకోడంపై గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


