● కదిలిన ఆరోగ్య సిబ్బంది
● 20మందికి రక్తపరీక్షలు
● సీజనల్ వ్యాధులపై అవగాహన
అక్కన్నపేట(హుస్నాబాద్): ‘గిరిజన తండాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు’అంటూ ఈ నెల 06న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆరోగ్యసిబ్బంది స్పందించారు. మండలంలోని చాపగానీతండా గ్రామపంచాయితీలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 40మంది ప్రజలు పాల్గొని 20 మందికిపైగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎల్‌హెచ్‌పీ దివ్య మాట్లాడుతూ...తండాలో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా దోమల వ్యాప్తిని నివారించటం, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు చేశారు. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో ఆశా కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు రాజేందర్, హెల్త్ అసిస్టెంట్ బాబురావు, ఏఎన్‌ఎం రజిత, ఆరోగ్య సిబ్బంది శ్రీనివాస్, సాంబయ్య, ఫరీద్, ఆశ కార్యకర్త తదితులు పాల్గొన్నారు.


