ములుగు(గజ్వేల్): ట్రాక్టర్‌ను అపహరించిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం ములుగు ఎస్‌ఐ రఘుపతితో కలిసి గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్నగూడ గ్రామానికి చెందిన మన్నె ప్రవీణ్ తన తండ్రి ఏగొండకు చెందిన ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసి అక్కడే వదిలేసి వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5న రాత్రి తన ట్రాక్టర్‌ను పొలం వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రఘుపతి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగన్నగూడకు చెందిన పాత నేరస్తుడు మన్నె నరేశ్(33) అపహరణకు గురైన ట్రాక్టర్‌ను మేడ్చెల్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని విచారించగా ట్రాక్టర్‌ను అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.
24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు


