కేసీఆర్‌ను కలిసిన ‘గూడెం’ | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన ‘గూడెం’

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

కేసీఆర్‌ను కలిసిన ‘గూడెం’ బీఆర్‌ఎస్‌ పాలనలో మోసపోయిన ప్రజలు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి సంతలో దొంగల హల్‌చల్‌

పటాన్‌చెరు: మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్య క్రమాలను ఆయనకు వివరించారు. గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నియోజకవర్గానికి నిధులు కరువయ్యాయని వాపోయారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 22–ఏ మూలంగా నియోజకవర్గంలో 50 వేలకు పైగా ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరాయని, ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి ప్రజలకు న్యాయం చేయా లని కేసీఆర్‌కు విన్నవించారు.

పటాన్‌చెరు టౌన్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశ పెడుతుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పటాన్‌చెరులో గాంధీ పార్క్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు వికాస పాదయాత్ర చేపట్టారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి, ఉద్యోగ నియామకాలు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ఐఎన్‌టీయూసీ, యువజన, మహిళా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): 18 ఏళ్లు నిండిన నూతన ఓటర్లు తమ దరఖాస్తులు అందించాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఆదివారం మండలంలోని రుద్రారం, కొర్విపల్లి పోలింగ్‌ బూత్‌లను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఓటర్లు ఫారం–6 ద్వారా దరఖాస్తులు అందించాలన్నారు. అలాగే ఏదైనా సవరణ అవసరమైతే ఫారం–8 ద్వారా అందించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, నోటీస్‌లు అందుకున్నవారు తమ వివరణ అందించాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్‌ మాలతి, ఆర్‌ఐ రాజు ఉన్నారు.

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కోసం వచ్చిన వారి సెల్‌ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయి. వారాంతపు సంతకు సమీప గ్రామాల నుంచి ప్రజలు, పరిశ్రమల కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో జేబుల్లోని సెల్‌ఫోన్‌లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. ప్రతివారం చోరీలు పరిపాటిగా మారిపోవడంతో సంతకు రావడానికి జనాలు జంకుతున్నారు. గతం వారం సంతలో ఒకేరోజు పది మంది ఫోన్‌లు చోరీకి గురైనట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెల్‌ఫోన్‌లు దొంగిలిస్తూ మైనర్లు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు నిఘాను పెంచి మార్కెట్‌లో సెల్‌ఫోన్‌ దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement