రామచంద్రాపురం(పటాన్‌చెరు): అక్రమ అరెస్ట్‌లతో తమ గొంతు నొక్కలేరని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సోమవారం పట్టణంలోని నివాసంలో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపు మేరకు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తమను హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.
పుల్‌కల్(అందోల్): మండల పరిధిలోని సింగూర్ ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సమాఖ్యలో రుణాల రికవరీలో అవకతవకలు జరిగినట్లు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 23 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు ప్రతీ నెల వాయిదాల ప్రకారం చెల్లించాలి. అయితే కొందరు సభ్యులు రుణాల రికవరీపై నిర్లక్ష్యం వహిస్తూ చెల్లింపులు జరపలేదు. దీంతో వీఓఏ రెగ్యూలర్‌గా చెల్లింపులు జరిపే మహిళల నుంచి తీసుకున్న రుణ డబ్బులను సభ్యులందరికీ సర్ధుబాటు చేసి చెల్లింపులు చూపారు. దీంతో సక్రమంగా చెల్లించే మహిళా సభ్యులు సకాలంలో చెల్లించనట్లుగా మారారు. ఈ విషయం బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకున్న మహిళా సభ్యులు ఐకేపీ అధికారులను నిలదీశారు. దీంతో సోమవారం ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సుమారు రూ.10 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొండాపూర్(సంగారెడ్డి): రెండు రోజులుగా కొండాపూర్‌లో జరుగుతున్న డీవైఎఫ్‌ఐ జిల్లా మహాసభలు సోమవారంతో ముగిశాయి. ముగింపు రోజున జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, కార్యదర్శిగా బాబురావు, ఉపాధ్యక్షులుగా అనిల్, శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా మోహిన్ పాషా, మహిపాల్, సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, జయరాజ్, నాగరాజ్, రాజయ్య , నర్సింలు, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్: జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణ అభినందనీయమని మురళీయాదవ్‌ను అభినందించారు. అనంతరం ఆయా రాష్ట్రాల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాక్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు. కాగా, వర్షంతో పోటీల నిర్వహణకు కొంత ఇబ్బందిగా మారింది.


