హత్నూర(సంగారెడ్డి): ‘చెత్తశుద్ధి కరువు‘ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి స్పందించారు. మండలంలోని ఎల్లమ్మగూడలో సేకరించిన చెత్తను చెరువులో వేసినందుకు కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చెరువులో వేసిన చెత్తను సిబ్బందితో తొలగింపజేశారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లలో వేర్వేరుగా వేసి ఎరువులు తయారు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఇష్టానుసారంగా చెత్తను చెరువుకుంటలో వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మండలంలో 38 పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు సైతం మెమోలు జారీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎంపీడీఓ యూసుఫ్ తెలిపారు.


