పటాన్‌చెరు టౌన్: సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ పథకాన్ని పునరుద్ధరించాలని టీఎస్ యుూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం పటాన్‌చెరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు(ఎంపీ, ఎమ్మెల్యే) ఒక్కసారి ఎన్నికై తే జీవితాంతం పెన్షన్ పొందుతున్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులు 30, 35 సంవత్సరాలు ప్రజా సేవలో ఉండి రిటైర్మెంట్ పొందితే పెన్షన్ లేకుండా చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఈనెల 10న చలో హైదరాబాద్ నిర్వహించి వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు, మండల విద్యాధికారి నాగేశ్వర్ నాయక్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతరావు తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి


