ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లిన శ్రీధర్ కుటుంబం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): నేపాల్, టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల్లో తెల్లాపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం గల్లంతైనట్లు తెలుస్తోంది. తెల్లాపూర్ పరిధిలోని ‘మై ఫెయిర్ అపార్ట్‌మెంట్’లో నివాసముండే ఎన్‌ఆర్‌ఐ శ్రీధర్ యూకే నుంచి వచ్చి 2023 నుంచి స్థానికంగా నివాసముంటున్నారు. కాగా, శ్రీధర్ అతని భార్య దీప్తి, కుమారుడు అభినవ్ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న మానస సరోవరయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 26న గ్యిరోంగ్ ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలో ఆకస్మిక వరదలు రావడంతో వారితో సంబంధాలు తెగిపోయాయి. శ్రీధర్ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో మైఫెయిర్ అపార్ట్‌మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉన్న శ్రీధర్ సోదరుడు విషయం తెలుసుకుని స్వదేశానికి వచ్చినట్లు సమాచారం. శ్రీధర్ కుటుంబ క్షేమంగా తిరిగి రావాలని స్థానికులు కోరుకుంటున్నారు.


