గైనకాలజిస్టులే లేక..
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నియామకాల లేమితో సతమతమవుతోంది. ఈ ప్రాంత పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్యులతోపాటు పారామెడికల్ సిబ్బంది కొరత వల్ల రోగులకు వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కూడా విధులకు సరిగ్గా రావడంలేదు. దీంతో పలు ఘటనలు చోటు చేసుకుని ఇక్కడి దయనీయ పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.
–జహీరాబాద్ టౌన్
వైద్య సిబ్బంది కొరత తదితర కారణాల వల్ల ఈ ఆస్పత్రిలో ఇటీవల వరుసగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆక్సిజన్ అందక నవజాత శిశువు మృతి చెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరో ఘటనలో డ్యూటీ డాక్టర్ గైర్హాజరు కాగా ఆమె స్థానంలో ప్రైవేట్ డాక్టర్ విధులు నిర్వహించారు. ఓ రోగికి ఈసీజీ తీయాల్సిరాగా టెక్నీషియన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో పేషంట్ కేర్ సిబ్బందే స్వయంగా ఈసీజీ తీసిన విషయం చర్చనీయాంశగా మారింది. దీంతో జిల్లా సబ్ కలెక్టర్ ఉమాహారతి ఇటీవల ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జహీరాబాద్ ఆస్పత్రిలో వరుస ఘటనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
రోజుకు వెయ్యి మంది
పట్టణం జాతీయ రహదారిపై ఉంది. దీంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి నియోజకవర్గంతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల రోగులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతీ రోజు ఆస్పత్రికి సుమారు వెయ్యి మందికి పైగా రోగులు ఆస్పత్రికి చికిత్స కోసం వస్తారు. ఏరియా ఆస్పత్రిలో సుమారు 130 మంది డాక్టర్లు, సిబ్బంది ఉండాలి కానీ 70 మంది వరకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 50 మంది డాక్టర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం 17 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రోగులకు వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.
ఖాళీలతోనే ఇబ్బందులు
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదకలు పంపించాం. ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందితో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం.
–డాక్టర్ కిరణ్‌కుమార్,
సూపరింటెండెంట్
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత
ఉన్న వారు ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరిగేవి. సుమారు 300 పైగా ప్రసవాలతోపాటు సీజేరియన్ ఆపరేషన్లు కూడా పెద్ద సంఖ్యలో నిర్వహించే వారు. ప్రసవాల కారణంగా ఆస్పత్రికి పలు అవార్డులు కూడా వచ్చాయి. అలాంటింది ప్రస్తుతం గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ముగ్గురిని నియమించారు. ఐదారుమంది ఉండాల్సిన చోట ముగ్గురు కాంట్రాక్టర్ సీ్త్ర వైద్యులు ఉండటంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


