ఇక స్మార్ట్‌ మీటర్లు | - | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్‌ మీటర్లు

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

విద్యుత్‌ శాఖలో అమలు!

విద్యుత్‌ శాఖలో అమలు!

నారాయణఖేడ్‌: విద్యుత్‌ శాఖలో చాలా ఏళ్లుగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారగా, తాజాగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు అనంతరం మొబైల్‌ ప్రీపెయిడ్‌ తరహాలోనే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రీచార్జ్‌ చేయని పక్షంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం షాపూర్‌నగర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఆరేళ్ల క్రితం అమలు చేశారు. విడతల వారీగా ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ అంశం ఏళ్లుగా పైలట్‌ ప్రాజెక్టుగా కొనసాగుతుండగానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్తుత్‌ శాఖ సన్నద్ధమవుతుంది. ఇదే అమలైతే స్మార్ట్‌ మీటర్ల వల్ల గ్రామీణ, పట్టణ ప్రజానీకం కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు అంశం తెరపైకి రాగానే ప్రజానీకం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. జిల్లాలో గృహ వినియోగదారులు, వ్యాపారులు, ఇండస్ట్రీయల్‌ విభాగాలకు సంబంధించి 7,29,228 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌కు సంబంధించి గృహజ్యోతి పథకం లబ్ధిదారుల కనెక్షన్లు 2,26,693 ఉన్నాయి.

భారంగా మీటర్‌!

స్మార్ట్‌ మీటర్లు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. విద్యుత్‌ శాఖ ఈ భారం భరిస్తుందా..? లేక వినియోగదారులపై మోపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌ వ్యయం వినియోగదారుకు రూ.1,300 వరకు ఉండగా, స్మార్ట్‌ మీటర్‌ రూ.7వేల వరకు అయ్యే అవకాశం ఉంది. త్రీఫేజ్‌ మీటర్‌కు రూ.10 వేల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినియోగదారులపై భారం మోపిన పక్షంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది. స్మార్ట్‌ మీటర్ల ఖర్చును వినియోగదారుడు భరించాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చు ఎంత అని నిర్ధారించే దానిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మీటర్‌ ఖరీదు నిర్ణయించిన అనంతరం బిగించనున్నారు. మొదట ఎస్‌పీడీజీఎల్‌ పరిధిలో కొత్త కనెక్షన్‌ పొందే వినియోగదారులకు అమలు చేయనున్నారు.

మొదట వారికే..

కొత్త వినియోగదారులకు మొదట ఏర్పాటు

దశల వారీగా అందరికీ..

అమలైతే మొబైల్‌ ప్రీపెయిడ్‌ తరహాలో రీచార్జీ

స్మార్ట్‌ మీటర్లను రెండేళ్ల క్రితం విద్యుత్‌శాఖ మొదట ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలని యోచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా ఏర్పాటు పూర్తి చేసిన అనంతరం వినియోగదారుల ఇళ్లకు బిగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం నూతనంగా విద్యుత్‌ కనెక్షన్‌ పొందనున్న వినియోగదారులకు మాత్రమే అమర్చాలని భావిస్తున్నారు. తర్వాత దశల వారీగా కార్యాచరణ రూపొందించి ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని సర్కిల్‌ పరిధిలో స్మార్ట్‌ మీటర్లను అముల చేయాలని చూస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement