కేతకీలో విప్‌ బీర్ల ఐలయ్య పూజలు | - | Sakshi
Sakshi News home page

కేతకీలో విప్‌ బీర్ల ఐలయ్య పూజలు

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

కేతకీలో విప్‌ బీర్ల ఐలయ్య పూజలు పెండింగ్‌ కేసులు పరిష్కరించండి సిబ్బంది సంక్షేమానికి కృషి కుంటను పరిశీలించిన పీసీబీ అధికారులు

ఝరాసంగం(జహీరాబాద్‌): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం రెండో సోమవారం పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమృత గుండంలో జల లింగానికి పూజలు చేసి గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ పాటిల్‌, ఆలయ ఈఓ శివ రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్‌: పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసులను పరిష్కరించి కక్షిదారులకు తగిన న్యాయం చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేయనున్నట్లు పోలీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌ అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న అసోసియేషన్‌ కమిటీ సభ్యులు సోమవారం ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. అనంతరం అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ.. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తామన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని చందంపేట శివారు పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న రసాయనాలతో కలుషితమైన కుంటను పీసీసీ అధికారులు సోమవారం పరిశీలించారు. సర్పంచ్‌ సంతోష ఫిర్యాదు మేరకు పీసీబీ ఎన్విరాల్‌మెట్‌ అసిస్టెంట్‌ ఏఈ రవీందర్‌ రాజారామ్‌ కుంటను పరిశీలించి శాంపిల్స్‌ తీసుకెళ్లారు. అనంతరం పరిశ్రమలోనూ తనిఖీలు నిర్వహించారు. రసాయన జలాలను సేకరించారు. ఈసందర్భంగా అధికారి మాట్లాడుతూ.. జలాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ల్యాబ్‌ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్‌, పరిశ్రమ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement