సాగు విస్తీర్ణం పెరిగింది
● అడపాదడపా కురిసిన వర్షాలు
● ఖరీఫ్ పంటలకు జీవం
● దిగుబడిపై రైతుల ఆశలు
జహీరాబాద్ టౌన్: జిల్లాలో పప్పుధాన్యాల సాగు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పంట దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సకాలంలో వర్షాలు పడలేవు. అడపాదడపా కురిసిన వానలకు పంటలు సాగు చేశారు. జూన్‌లో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. దీంతో వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఏటా పత్తి, వరి, చెరుకుతో పాటు కంది, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, సోయాబిన్ పంటలను రైతులు పండిస్తుంటారు. జిల్లాలో గతేడాది కన్న ఈ ఏడాది పప్పు ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. సుమారు 72 వేల ఎకరాల్లో సోయాబిన్, 75 వేల ఎకరాల్లో కంది, 7 వేల ఎకరాల్లో మినుము, 9 వేల ఎకరాల్లో పెసర, 12 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటలు వేశారు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గగా, చెరకు సాగు పెరిగింది. గతేడాది 36 వేల ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేశారు. ఈఏడాది సుమారు 45 వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. అదే పత్తి పంట సాగు జహీరాబాద్ డివిజన్‌లో తగ్గింది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పు ధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాం. దీంతో గతేడాది కన్న ఈ ఏడాది సాగు విస్తీర్ణం 15 శాతం పెరిగింది. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో రైతులు అధికారుల సూచనలు పాటించాలి. అవసరం మేరకు ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– భిక్షపతి, ఏడీఏ


