మా పరిధిలో లేదు..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న తమ ఆస్తులను ఆ జాబితాలోంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తుల్లో చాలా మట్టుకు జిల్లా అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. వివిధ కారణాలతో తాము జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నామని, ఈ దరఖాస్తులపై మీరే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ లెవల్ కమిటీకి పంపారు. జిల్లాలో పలు చోట్ల ప్లాట్లు, ఇండ్లు, అపార్టుమెంట్ ఫ్లాట్లు నిషేధిత భూముల జాబితా 22–ఏలో ఉన్నాయి. ఆర్థిక అవసరాల కోసం వీటిని అమ్ముకునేందుకు ప్రయత్నించగా, ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు కాదని ఆశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు లబోదిబోమంటున్నారు. తమ ఆస్తులను నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాస్థాయి కమిటీ సమీక్ష
సుమారు 70 వరకు దరఖాస్తులను కలెక్టర్ ప్రతీక్‌జైన్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ గురువారం సమీక్ష నిర్వహించింది. ఈ దరఖాస్తుల్లో కొన్ని అసైన్డ్ భూముల్లో ఇండ్లు ఉన్నాయి. గతంలో తక్కువ ధరకు వస్తుందనే కారణంగా అసైన్డ్ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రాజకీయ నాయకుల పలుకుబడితో ఈ అసైన్డ్ భూముల్లోనూ నిర్మాణానికి అనుమతులు పొందారు. చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ అసైన్డ్ భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించే అధికారం జిల్లాస్థాయిలో తమకు లేదని మీరే తేల్చాలని సుమారు 12 సర్వే నంబర్లలోని దరఖస్తులను స్టేట్ లేవల్ కమిటీకి పంపారు.
22–ఏ జాబితాలోంచి తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులు
సమీక్షించిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ
రాష్టస్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అసైన్డ్, ఫ్రీడం ఫైటర్, మాజీ సైనికుల భూముల విషయంలోనూ ఇదే నిర్ణయం
పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కొందరు బడా రాజకీయ నాయకులు, రియల్టర్లు కలిసి బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. తమ పలుకుబడిని ఉపయోగించి వాటిలో వెంచర్లకు అనుమతులు పొంది ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తీరా ఈ భూములు 22–ఏలోకి వెళ్లి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇలాంటి భూముల విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవాలని స్టేట్ లేవల్ కమిటీకి ప్రతిపాదించారు.
మాజీ సైనిక ఉద్యోగుల భూముల్లోనూ కొందరు నాయకులు ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ భూములు కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో చేరడంతో ఇందులోని పాట్లు కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. తమ పాట్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ చేసుకున్న దరఖాస్తులను కూడా తాము ఏమీ చేయలేమని, స్టేట్ లేవల్ కమిటీకి నివేదించారు. ఇలా 70కి పైగా సర్వే నంబర్లలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఇందులో సుమారు 12 సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులను నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు.


