‘పట్టు’కోల్పోతుండ్రు | - | Sakshi
Sakshi News home page

‘పట్టు’కోల్పోతుండ్రు

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

అధికారులు లేక.. అవగాహన కల్పిస్తున్నాం

విస్తృతంగా సబ్సిడీలు ఇస్తున్నా..

రైతులకు చేరని పంట పరిజ్ఞానం

మెదక్‌ జిల్లాలో వంద ఎకరాలకు చేరని సాగు

పట్టు పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలు.. అధికారులను మాత్రం నియమించడం లేదు. ఎంతో లాభదాయకంగా ఉండే పట్టు పరిశ్రమపై రైతులకు తెలియడం లేదు. ఫలితంగా రైతులంతా వరి పంట సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు ఆలస్యమవుతున్నాయి.

– ఆంజనేయులు, రైతు, కౌడిపల్లి

జిల్లాలో రైతులకు మల్బరి సాగుపై, సబ్సిడీలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎకరాకు 5వేల మొక్కలు అవసరం. ఎకరాకు 150 నుంచి 200 గుడ్లు అవసరం. 45రోజుల్లో పంట క్రాప్‌కు వస్తుంది. పంటకు పంటకు మధ్య 10 రోజుల గ్యాప్‌ ఉంటే సరిపోతుంది. కిలో గుడ్లు(కాకూన్‌) రూ.900ల వరకు అమ్ముడవుతాయి. పంట సాగు చేస్తే ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.80వేల వరకు లాభాలు వస్తాయి.

– లింగం, సెరి కల్చర్‌ జిల్లా సహాయ అధికారి మెదక్‌.

మెదక్‌ కలెక్టరేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా సబ్సిడీలు ఇస్తున్నా.. అధిక లాభాలు వచ్చే పట్టు పరిశ్రమపై మెదక్‌ జిల్లాలో రైతులకు అవగాహన కొరవడుతోంది. ఫలితంగా జిల్లాలో మల్బరి సాగు పట్టు పురుగుల పెంపకం పట్టుజారుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రం పట్టు పరిశ్రమతో విరాజిల్లింది. నేడు పట్టు పురుగుల పెంపకం నానాటికి అడుగంటి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనంతోనే పట్టు పరిశ్రమ జాడలేకుండా పోతుందన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఎక్కడ కూడా వరి పంట కాకుండా ప్రత్యామ్నయ పంటలు పెరగక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జిల్లాలో 90శాతం రైతులు కేవలం వరి పంటపైనే ఆధార పడుతున్నారు.

కొరవడిన ప్రచారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని పట్టు పురుగుల పెంపకం చేపడితే రైతులు అధిక లాభాలు గడించవచ్చు. జిల్లాలో వరి, జొన్న, ఆయిల్‌పామ్‌ పంటల గురించే తప్ప పట్టు పరిశ్రమపై ఉద్యాన శాఖ, వ్యవసాయశాఖలు ప్రచారం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట వేస్తుండగా కనీసం వంద ఎకరాల్లో కూడా మల్బరిసాగు లేక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.

చేరని సబ్సిడీలు

పట్టు పురుగుల పెంపకం, మల్బరి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తున్నాయి. వీటి గురించి చాలా వరకు రైతులకు చేరక పోవడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం డ్రిప్‌ ఇరిగేషన్‌, షెడ్డు నిర్మాణానికి లక్షలాది రూపాయల సబ్సిడీలు, మొక్కలకు, పట్టుగుడ్ల కొనుగోలుకు సబ్సిడీలు అందిస్తున్నాయి. అలాగే బీసీలకు, ఇతరులకు 50శాతం సబ్సిడీలు అందిస్తున్నారు. పట్టు పురుగుల పెంపకానికి ఏర్పాటు చేసే షెడ్డు నిర్మాణం కోసం బీసీలకు రూ.2.25 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు 2.92,500లు అందిస్తున్నారు. అలాగే పురుగుల పెంపకానికి అవసరమయ్యే స్టాండ్‌ నిర్మాణానికి రూ.10,890లు ఎస్సీ, ఎస్టీలకు రూ.22,140లు, మల్బరి మొక్కలు, గుడ్లకు ఎకరాకు రూ.60వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.78వేల సబ్సిడీ అందిస్తున్నారు.

76 ఎకరాల్లో సాగు

జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా కేవలం ఆరు మండలాల్లో మొత్తం 76 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకం, మల్బరి సాగు అవుతోంది. మిగతా 15 మండలాల్లో మల్బరి సాగు జాడలేదు. జిల్లాలోని కౌడిపల్లి–30, పాపన్నపేట–15, రామాయంపేట–4, నిజాంపేట–2, వెల్దుర్తి–15, చిలిపిచెడ్‌–10 మొత్తం 76 ఎకరాల్లో మల్బరితోట, పట్టు పురుగుల పెంపకం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement