సంగారెడ్డి టౌన్: వయో వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలో సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయో వృద్ధులు తమ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. హక్కులు, సంక్షేమం, ఆస్తి పరిరక్షణకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అందుబాటులో ఉంటుందని, అవసరమైన న్యాయ సలహాలు పొందవచ్చన్నారు.
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ త్వరతగతిన కుట్టించాల్సిన బాధ్యత మండల ఏపీఎంలపై ఉందని ఐకేపీ డీపీఎం రమేశ్‌బాబు అన్నారు. శుక్రవారం హత్నూర ఐకేపీ కార్యాలయంలో యూనిఫారాలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 23 గ్రామీణ మండలాల్లోని 945 పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతితో పాటు కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న మొత్తం 61,777 విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12,461 యూనిఫామ్స్ కుట్టడం పూర్తయిందన్నారు. 7,563 యూనిఫారాలను ఇప్పటికే విద్యార్థులకు అందించామన్నారు. ప్రస్తుతం మరో రెండు వేలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. వస్త్రం కొంత ఆలస్యంగా జిల్లాకు రావడంతో లేటు జరుగుతుందన్నారు. అయినప్పటికీ త్వరితగతిన యూనిఫారాలను కుట్టించేందుకు మండల స్థాయిలో ఏపీఎం, సీసీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎం రాజశేఖ ర్, సీసీలు, మండల సమైక్య సంఘం సభ్యులు ఉన్నారు.
జహీరాబాద్: పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని కోహీర్ మండలానికి తాత్కాలికంగా మార్చారు. అద్దె భవనంలో కొనసాగుతూ వస్తున్న కార్యాలయానికి సంబంధించిన అద్దె గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంది. దీంతో భవన యజమాని అద్దె బకాయిల కోసం ఒత్తిడి చేయడంతో పాటు భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరినందునే మార్చినట్లు సమాచారం. కార్యాలయాన్ని కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో గల అంగన్‌వాడీ సొంత భవనంలోకి మార్చారు. అయితే కార్యాలయానికి వెళ్లే ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు, అవసరాల కోసం వెళ్లే తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.


