ఊరికో వెబ్‌సైట్‌ | - | Sakshi
Sakshi News home page

ఊరికో వెబ్‌సైట్‌

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

అర చేతిలో పల్లె సమస్త సమాచారం

ఉమ్మడి జిల్లా పైలెట్‌ ప్రాజెక్ట్‌లో మూడు గ్రామాల్లో రూపకల్పన

సిద్దిపేట జిల్లాలో కూరెళ్ల, సంగారెడ్డిలో చిన్నలోని, మెదక్‌లో నందగోకూల్‌ జీపీలు

ప్రత్యేక అధికారుల నియామకం

ఒక్క క్లిక్‌తో గ్రామ సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పల్లెలోని ప్రతి అంశం.. వీధిదీపాల నుంచి వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల దాకా క్షణాల్లో తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలోని ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి మూడు గ్రామాల వెబ్‌సైట్లు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట

మ్మడి మెదక్‌ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలున్నాయి. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీల వెబ్‌ సైట్‌లను రూపొందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల, మెదక్‌ జిల్లా నందగోకూల్‌ గ్రామ పంచాయతీ, సంగారెడ్డి జిల్లా చిన్నలోని గ్రామ పంచాయతీలను పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వెబ్‌సైట్‌ల రూపకల్పన చేశారు. వెబ్‌సైట్‌లో పంచాయతీ కోడ్‌, వైశాల్యం, జనాభా, కుటుంబాలు, గృహాలు, రేషన్‌ కార్డులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, పంచాయతీ, మండల, శాసనసభ, పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఫోన్‌ నంబర్లు, రహదారులు, నల్లాలు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, మహిళా సంఘాలు ఇలా సమస్త సమాచారం ఉండనుంది.

మూడేళ్ల ప్రణాళిక

గ్రామ పంచాయతీలో 2026–27, 2027–28, 2028–29 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చేసే సమగ్ర అభివృద్ధి సమాచారం పొందుపరచనున్నారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, వీబీ రామ్‌జీ ఆధ్వర్యంలో చేసే పనులు, స్వచ్ఛభారత్‌ మిషన్‌, జీపీకి అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్‌కు సంబంధించిన నివేదికను తయారు చేసి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు.

అధికారుల నియామకం

ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌లను రూపొందించేందుకు పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. సంగారెడ్డి, సిద్దిపేటలకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ విజిలెన్స్‌ అధికారి ఉమారాణి, మెదక్‌ జిల్లాకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయరావులను నియమించారు. వీరు పల్లెలకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు.

కూరెళ్ల పంచాయతీ వివరాలు

సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామ జనాభా 2,586. అందులో పురుషులు 1,236, మహిళలు 1,350 మంది ఉన్నారు. కుటుంబాలు 623, రైతులు 854, వాటర్‌ సోర్స్‌ ఐదు చెరువులు, అంతర్గత రోడ్లు 9.9కిలో మీటర్లు, బీటీ రోడ్లు 1.5కిలో మీటర్లు, సీసీ రోడ్లు 2.4కిలో మీటర్లు, గ్రావెల్‌ రోడ్లు4.5కిలో మీటర్లు, విద్యుత్‌ స్తంభాలు 252, ఎల్‌ఈడీ లైట్లు 238, ఓపెన్‌ సీసీ డ్రైనేజీ 1.5కిలోమీటర్లు, కచ్చా డ్రైన్‌ 45మీటర్లు, ఆర్‌సీసీ హౌస్‌లు 319, రేకుల ఇళ్లు 71, పెంకుటిళ్లు 228, స్వయం సహాయక సంఘాలు 65, ట్యాప్‌ కనెక్షన్లు 601 ఇలా పలు వివరాలతో సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పబ్లిక్‌ డోమైన్‌గా అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement