టీచర్లకు ఏఐ శిక్షణ
సర్కారు బడి..
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తున్నారు. తొలుత ఏఐ నేర్చుకోవాలనుకునే ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 168 మంది ఉపాధ్యాయులున్నారు.
వచ్చే నెల 5 వరకు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ బాధ్యతలను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విద్యాశాఖ అప్పగించింది. వీరికి వచ్చే నెల 5వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రోజు రాత్రి 7 గంటల నుంచి 8:30గంటల వరకు జూమ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేషన్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లో ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్‌షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. విద్యార్థుల డేటాగోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత శిక్షణ తోపాటు త్వరలో ఏఐ వినియోగంపై ప్రాక్టికల్ వర్క్‌షాపులు నిర్వహించనున్నారు.
కేవలం 168 మందే ఆసక్తి
ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులున్నారు. ఇందులో కేవలం 168 మందే ఏఐ శిక్షణకు ముందుకు రావడం చూస్తుంటే.. కొత్త పరిజ్ఞానం నేర్చుకోవాలని మక్కువ ఎంతమందికి ఉందో తెలుస్తోంది. త్వరలో నిర్వహించే మరో విడత శిక్షణకై నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 168 మంది ఉపాధ్యాయులు


