దుబ్బాకరూరల్: గుర్తు తెలియని మహిళపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన దుబ్బాక మండలంలోని రామక్కపేట–లచ్చపేట గ్రామాల మధ్య ఈ నెల 9న జరిగిన విషయం విదితమే. కాగా పెట్రోల్ పోసి తగులబెట్టడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేక పోయారు. ఈ క్రమంలో తమ చిన్నమ్మ ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయిందని అదే రోజు సాయంత్రం అక్భర్‌పేట – భూంపల్లి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన అధికం స్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మృతురాలు కూతురు, కుటుంబీకులకు మృతదేహాన్ని చూపించారు. ఆనవాళ్లు గుర్తుపట్టి తన తల్లి విజయ(45)అని పోలీసులకు తెలిపింది. దీంతో మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా విజయకు ఒక కూతురు ఉండగా ఆమెకు వివాహమైంది. విజయ భర్త పదేళ్ల క్రితమే మృతి చెందాడు. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కొడుకు, కూతురు ఉండగా ఆమె తన కొడుకు వద్ద ఉంటుంది. కాగా రెండో భార్య విజయ భూంపల్లిలోని డబుల్‌బెడ్రూంలో ఉంటూ బీడీలు చేస్తూ ఉండేది. మొదటి భార్య కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఆస్తి కోసం చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


