వానాకాలం..
వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు i నివారణకు చికిత్స తప్పనిసరి
టేక్మాల్(మెదక్): వర్షాకాలంలో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వ్యాధుల ముప్పు పొంచి ఉంది. పశువులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బువాపు లాంటి వ్యాధులు రావడంతో పాటు ఈగలు, దోమల దాడి పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సకాలంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ.. వైద్యం చేయించాలని పశువైద్య అధికారులు సూచిస్తున్నారు.
గాలికుంటు వ్యాధి
ఈ వ్యాధి సోకితే పశువులు చాలా బలహీనంగా ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయ పనులు చేయడానికి ఎద్దులు సహకరించవు. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి.
జబ్బవాపు..
తెల్లజాతి పశువుల్లో జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాధి సోకిన పశువులు అధిక జ్వరంతో బాధపడతాయి. మేత మేయకుండా పడుకొనే ఉంటాయి. జబ్బభాగం వాచి నల్లగా కనబడుతుంది. అక్కడ కండరాలు ఉబ్బి ఉంటాయి. సకాలంలో వైద్యం అందించకపోతే చనిపోయే ప్రమాదం ఉంది.
గొర్రెల్లో కాలి పుండ్ల వ్యాధి
గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్లు వ్యాపిస్తాయి. గిట్టల మధ్య చర్మం మెత్తబడి వాచి చిట్లుతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి ముదిరితే గిట్టలు ఊడిపోతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలకు 10 శాతం జింక్ సల్ఫేట్, లేదంటే ఐదు శాతం ఫార్మలిన్‌లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి.
గొంతువాపు సోకితే..
పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గొంతుపై, మెడకింద వాపు కనిపిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస తీసుకుంటుంది. గురుక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరకు అపస్మారకస్థితికి వెళ్లి చనిపోతాయి.


