● హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌లకు ఎలాంటి సంబంధం లేదు ● సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పాస్‌పోర్టు కేసు నమోదైందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసి పెట్టిన కేసు కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో జగ్గారెడ్డి అరెస్టు అనేది చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందే తప్ప..ఇందులో హరీశ్‌రావుకు గానీ, బీఆర్‌ఎస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హరీశ్‌రావుపై జగ్గారెడ్డి చేసిన ఆరోపణలకు మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో చింత ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. చేసిన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు జగ్గారెడ్డి ఎదుటి వారిపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ హోదా లేని జగ్గారెడ్డి ఈనెల 15న జరుగనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభా వేదికపై కూర్చునే అవకాశం లేదనే చికాకు, ఒత్తిడిలో హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల క్రితం జరిగిన రాహుల్‌గాంధీ సభ కోసం రూ.6.50 కోట్లు అప్పు తెచ్చానంటూ జగ్గారెడ్డి పలుమార్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ మెప్పు కోసమే ఈ సభ ఏర్పాటు చేశారే తప్ప సంగారెడ్డి ప్రజల కోసం కాదనేది గుర్తుంచుకోవాలని వివరించారు. ఈ సభ పేరుతో ఏదైనా నామినేట్ పదవి కోసం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సింపతీ కొట్టేసే ప్రయత్నం జగ్గారెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.


