చింత ప్రభాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
సంగారెడ్డి: జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. తాము చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడంతో కేసీఆర్, హరీశ్‌రావు జగ్గారెడ్డిపై కక్ష పెంచుకున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...చింత ప్రభాకర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తారు. సీలింగ్ భూమి రిజిస్ట్రేషన్, దళితుల భూములు, సదాశివపేటలో రోడ్ల కబ్జా, మాలకుంట కబ్జా తదితర అంశాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల వ్యవహరించిన తీరుపైనా తప్పుపట్టారు. సదాశివపేటలో ఎక్కడికి రమ్మన్నా మేము అక్కడికి వస్తామని, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


