● కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఎమ్మెల్యే వినతి ● ప్రభుత్వాస్పత్రి కరెంట్ కష్టాలపై ఎమ్మెల్యే సీరియస్
పటాన్‌చెరు: పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో విద్యుత్ సమస్యలు తొలగించేందుకు తక్షణమే రూ.4 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తి రోగులు ఇబ్బందులు పడుతున్న ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆస్పత్రి ఆర్‌ఎంఓ శ్రీనివాస్, వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్షించారు. ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తినా జనరేటర్ పనిచేయకపోయినా ఈ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభించి, ఆస్పత్రిలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వైద్య సదుపాయాలు, రోగులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించేందుకు త్వరలోనే ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.


