● ఆందోళన చెందుతున్న భక్తులు
● శ్రావణమాసంలో అన్నీ పండుగలే..
● ధరలు నియంత్రించాలంటున్న ప్రజలు
సంగారెడ్డి క్రైమ్ / హత్నూర (సంగారెడ్డి): కొబ్బరికాయ ధరలు కొండెక్కాయి. ప్రస్తుత ఆషాఢ మాసంలో బోనాల సందడి మొదలైంది. భక్తులు ఆలయంలో కొట్టే కొబ్బరికాయ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభం కానుంది. ఈ మాసం మొత్తం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎటు చూసినా బోనాల సందడి మొదలు కావడంతో స్థానిక భక్తులు సైతం నిరంతర భక్తిశ్రద్ధలతో దేవతలను కొలుస్తుంటారు. దీంతో హోమాలు, శుభకార్యాలు సైతం పెరిగాయి. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల ధరలు భారీగా పెరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక కొబ్బరికాయ రూ. 20 నుంచి రూ.30 ధర పలికితే, ప్రస్తుతం మార్కెట్‌ల్లో రూ. 35 నుంచి రూ.45 వరకు పలుకుతుంది.
ఉత్పత్తి తగినంత లేకే..
ప్రస్తుతం కొబ్బరికాయల ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్లే ధరలు భారీగా పెరిగాయని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు నెలల్లో ఒక కొబ్బరికాయ రూ. 25 పలికితే ప్రస్తుతం కొబ్బరికాయ రెట్టింపు ధర పలుకుతోందని చెబుతున్నారు. దీంతో ఎండు కొబ్బరి రేట్లు సైతం అమాంతం పెరిగాయి. ప్రస్తుతం సంగారెడ్డి మార్కెట్లో నిత్యం 2వేల నుంచి 3వేల కొబ్బరికాయలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొబ్బరికాయలు కొనాలంటే హడలి పోతున్నారు. మార్కెట్లో కొబ్బరికాయల ధర రూ. 40 పైనే పలుకుతుండడం భక్తులను భయపెడుతోంది. ఆషాఢం తర్వాత శ్రావణమాసంలో వచ్చేవన్నీ ముఖ్యమైన పండుగలే అవడంతో.. కొబ్బరికాయల ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవని పలువురు భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొబ్బరికాయల ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.


