మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై అచేతనంగా పడి ఉన్న క్షత్రగాత్రులకు సపర్యలు చేసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి క్రాస్ రోడ్డు శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. భూంపల్లి గ్రామానికి చెందిన బోయిని చంద్రయ్య దంపతులు ఆదివారం భూంపల్లి నుంచి, చేగుంట మండలంలోని బోనాల కొండాపూర్‌కు ఎక్సెల్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో భూంపల్లి క్రాస్ రోడ్డు దాటిన తర్వాత చిన్న వాగు బ్రిడ్జిపై వాహనం అదుపుతప్పి కిందపడటంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడి ఉన్న దంపతులను అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి గాయాలపాలైన దంపతులకు మంచినీరు తాగించి సపర్యలు చేశారు. వెంటనే అంబులెన్సును రప్పించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రికి ఫోన్ చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు.


