రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

కొన్ని రోజుల క్రితం తండ్రి.. నేడు కొడుకు

మృతుడు హైదరాబాద్‌ వాసి

నర్సాపూర్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్‌ – హైదరాబాద్‌ అటవీ ప్రాంతంలోని కొండాపూర్‌ టర్నింగ్‌ వద్ద చోటుచేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై రంజిత్‌ రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన షేక్‌ హసిన్‌ మెహతా(19) బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కాగా తన స్నేహితులు వెంకటగిరీష్‌, చంద్ర, దేవ సునందన్‌ సాయితో కలిసి మియాపూర్‌ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని అర్బన్‌ పార్క్‌ను చేసేందుకు బైక్‌లపై వచ్చారు. పార్క్‌ను చూసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కొండాపూర్‌ సమీపంలోని టర్నింగ్‌ వద్ద షేక్‌ హాసిన్‌ మెహతా అతివేగంగా వెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా తోటి మిత్రులు నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మిన్నంటిన రోదన..

గతంలో భర్త, ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్‌ మియాపూర్‌లో నివాసముంటున్న షేక్‌ మేరాబీకి ఒక కొడుకు. కొన్ని రోజుల క్రితం భర్త షేక్‌ సలీం మృతి చెందగా టైలరింగ్‌ పనిచేస్తూ కొడుకును మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివిస్తుంది. ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న ఆ తల్లికి కన్నీళ్లే మిగిలాయి. ఆమె రోధించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

డివైడర్‌ను ఢీకొట్టి ప్రభుత్వ టీచర్‌..

కొల్చారం(నర్సాపూర్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హైమద్‌ మోహినొద్దీన్‌ వివరాలు.. కౌడిపల్లి మండలం సిరి తండాకు చెందిన రామచంద్రం(60) అదే మండలంలోని కూకుట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాడు. శనివారం పనిపై మెదక్‌కు బైక్‌పై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కొల్చారం బస్టాండ్‌ సమీపంలోకి రాగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో, రామచంద్రంను మొదట అంబులెన్స్‌లో నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన రామచంద్రం చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్మెంట్‌ కావాల్సి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement