వీడిన చిన్నారుల అదృశ్యం మిస్టరీ
రామాయంపేట(మెదక్): జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన సుఖాంతమైంది. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారుల ఆచూకీని కనుగొన్న పోలీసులు కామారెడ్డిలో వారిని పట్టుకొని ఆదివారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక సీఐ సైదా తెలిపిన వివరాలు.. స్థానిక కేసీఆర్ (డబుల్ బెడ్రూం) కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు మొక్కొండ ధనుష్, ఆరె మనోజ్, షేక్ సమీర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కొంతకాలంగా వారు సక్రమంగా పాఠశాలకు వెళ్లకుండా ఆటపాటలతో గడుపుతున్నారు. బుధవారం అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతూ, దిగుతూ ఆడుకుంటుండగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి చూసి మీ తల్లిదండ్రులకు చెబుతానని, ఇంటికి వెళ్లిపొమ్మని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ముగ్గురు బాలురు గురువారం రాత్రి కాలనీ నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం చిన్నారుల కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు తీవ్రంగా గాలించారు. వీరు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కామారెడ్డిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి వారిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పిల్లలు సక్రమంగా స్కూలుకు వెళ్తున్నారా? లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్‌ఐ బాల్‌రాజు పాల్గొన్నారు.


