కౌడిపల్లి(నర్సాపూర్): క్షేత్రస్థాయిలో వ్యవసాయం చూసేందుకు, చూసి నేర్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలకు హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన విజ్ఞానజ్యోతి పబ్లిక్‌స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం స్టడీటూర్‌కు వచ్చారు. దీంతో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఫీల్డ్ మేనేజర్ జగదీశ్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వివిధ రకాల పంటలు, కూరగాయాల సాగు, పాడిపరిశ్రమ, వర్మీకంపోస్ట్ ఎరువుల తయారీ తదితర విషయాలను చెప్పగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు వరినాటు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోపాలరావ్ మాట్లాడుతూ...విద్యార్థుల స్టడీటూర్‌లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను విద్యార్థులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు వరి, కూరగాయల సాగు, పశుపోషణ విధానం పరిశీలించారని తెలిపారు.


