నారాయణఖేడ్/సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి, ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రారంభించగా తాజాగా మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రజావాణి నిర్వహణ, విధివిధానాలపై ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రాల్లో వినతులు స్వీకరించటంతో ప్రజలకు దూరాభారంతోపాటు సమయం, ఖర్చులు ఆదా కానున్నాయి.
నోడల్ అధికారిగా మండల పరిషత్ అధికారి
మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆయా మండలాల్లో విధులు నిర్వహించే తహసీల్దార్, ఎంపీడీఓ, విద్య, వైద్యం, వ్యవసాయ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, త్రాగునీరుతోపాటు ఇతర మండల శాఖ అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.
పకడ్బందీగా నిర్వహణ
ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ నోడల్ అధికారి పర్యవేక్షణలో పకడ్బందీగా జరుగుతుంది. నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లతో పాటు హెల్ప్ డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు త్రాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కొరకు వీల్ చైర్, వైద్య శిబిరం తో పాటు ఇతర వసతులు కల్పించాలి. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రతీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహణ
ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
నోడల్ అధికారిగా ఎంపీడీఓకు బాధ్యతలు
వేగవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
మండలస్థాయి అధికారులు హాజరయ్యేనా!
మండల కేంద్రంలో ప్రజావాణికి అన్ని శాఖల మండల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ మండలంలో విధులు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు గతంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కాకపోగా తమ కిందిస్థాయి సిబ్బందిని పంపించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మండల అధికారులు పూర్తి స్థాయిలో హాజరు అవుతారా లేదో వేచి చూడాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు
జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్‌తోపాటు ఒక సబ్ కలెక్టర్, 3 రెవెన్యూ డివిజన్, 25 మండల ప్రజా పరిషత్తు కార్యాలయాలున్నాయి. ప్రజావాణిలో దరఖాస్తులను ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేసి, గ్రీవెన్స్ ఐడీ జారీ చేస్తారు. కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాల్సి ఉంటుంది.


