నాగర్‌కర్నూల్ రెండో అదనపు
జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి
పటాన్‌చెరు టౌన్: అమ్మ దయ ప్రజలందరిపై ఉండాలని నాగర్ కర్నూల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, కల్వకుర్తి కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి శ్రీనిధి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. రెండోరోజు శ్రీ దుర్గాదేవి ఆలయంలో నిర్వహించిన పూజల్లో నాగర్ కర్నూల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, ఆమె భర్త హైకోర్టు న్యాయవాది దశరథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మధు ఏర్పాటు చేసిన ఫలహారం బండి ఊరేగింపులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సీడీపీఓ సుశీల
జహీరాబాద్: తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని ఐసీడీఎస్ సీడీపీఓ సుశీల, జహీరాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శిరీషరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..శిశువుల ఆరోగ్య సంరక్షణలో తల్లిపాల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. పుట్టిన గంటలోనే తల్లిపాలను ప్రారంభించాలన్నారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలనే అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అనంతసాగర్‌లో ఉన్న ఎర్ర కాలువకు గండి పడటంతో పొలాల్లోకి వరద చేరుతోంది. దీంతో పంటపొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎర్రకాలువకు గండి పడటంతో నీటిని దారి మళ్లించడానికి రైతులు తమ సొంత డబ్బులు పెట్టి జేసీబీతో మొరం వేయించి మరమ్మతులు చేశారు. ప్రతీ ఏటా మోమిన్‌పేట చెరువులో నుంచి మల్కాపూర్ పెద్ద చెరువుకు ప్రవహించే ఎర్రకాలువ ప్రమాదకరంగా మారుతుండటంతో కాల్వకు గండి పడకుండా మరమ్మతులు చేయాల్సిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఎర్రకాలువ గండి పడకుండా పూర్తిస్థాయి మరమ్మతు పనులు చేపట్టాలని, కల్వర్టు నిర్మించి రైతులు పొలాలకు వెళ్లేందుకు దారిని బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.


