నిషేధిత కష్టాలకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

నిషేధిత కష్టాలకు చెక్‌!

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా (ప్రొహిబీటెడ్‌ లిస్టు)లో ఉన్న పట్టా భూములు, నివాస స్థలాలను ఆ జాబితాలో నుంచి తొలగించేందుకు వస్తున్న దరఖాస్తులపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. వాటి పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), ఆర్డీఓ, సంబంధిత మండల తహసీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన ఎస్‌ఆర్‌ఓ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములు, ప్లాట్లను తొలగించాలని వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వాస్తవంగా అది నిషేధిత జాబితా పరిధిలోకి రాదని తేలితే జాబితాలోంచి తీసి వేయాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఐజీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతారు. కలెక్టర్‌ ప్రతిపాదనల మేరకు ఐజీ కార్యాలయం ఈ జాబితాను అప్‌డేట్‌ చేస్తుంది.

పక్షం రోజులకోసారి సమీక్ష

నిషేధిత జాబితాలోంచి తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం జిల్లాస్థాయి కమిటీ పక్షం రోజులకోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ దరఖాస్తుకు సంబంధించిన తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. అలాగే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తారు. ఈ మేరకు ఇచ్చే నివేధిక ఆధారంగా నిషేధిత జాబితాలోంచి తీసివేయడామా.. కొనసాగించడమా..? అనేది ఈ కమిటీ తేలుస్తుంది. తీసివేయాల్సి వస్తే సంబంధిత పాట్ల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయానికి పంపుతారు. ఇటీవల జరిగిన ఈ కమిటీ సమావేశంలో కొన్ని దరఖాస్తులను ఈ కమిటీ పరిష్కరించినట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు

నిషేధిత జాబితాలో నమోదైన పట్టాభూములు, నివాస స్థలాలపై రిజిస్ట్రేషన్లు జరగవు. ఆయా భూముల సర్వే నంబర్లను భూభారతి పోర్టల్‌లో 22ఏ కింద నమోదు చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ప్రొహిబీటేడ్‌ లిస్టులో కూడా చేర్చారు. దీంతో నిజమైన పట్టాదారులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్లాట్లు, భూములు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. జిల్లాలో చాలా మంది ఇలాంటి సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ దరఖాస్తులు ఉంటున్నాయి. మరోవైపు బాధితులు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, బాధితుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు అధికారులు నిషేధిత జాబితాలోంచి తొలగించేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తేనే నిజమైన పట్టాదారులు, ప్లాట్ల యజమానులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

22ఏ నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై నజర్‌

పరిష్కారం కోసం కలెక్టర్‌

నేతృత్వంలో కమిటీ

సభ్యులుగా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement