అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

సంగారెడ్డి డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి

మోసపోయిన వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి

సంగారెడ్డి జోన్‌: సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియా వేదికగా ఫ్రెండ్‌షిప్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్న మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీ, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. జిల్లావ్యాప్తంగా కొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌షిప్‌ మోసాలతో 17 కేసులు నమోదయ్యాయి. డేటింగ్‌ యాప్‌, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌, మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా పరిచయాలు చేసుకుని, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ నమ్మిస్తారు. ఆ తర్వాత ప్రేమ వివాహం, విదేశీ ఉద్యోగం, బహుమతులు, పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి విలువైన సమాచారం సేకరించటంతోపాటు డబ్బులు గుంజుతారు.

నకిలీ ప్రొఫైల్స్‌తో నమ్మించి...

విదేశాల్లో స్థిరపడినట్లుగా అందమైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోలతో సోషల్‌ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్‌తో అకౌంట్లు తెరుస్తారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమ వివరాల సంభాషణ జరుపుతారు. అమాయకులను చాలా దగ్గరగా చేసుకుని విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తున్నామని, ఎయిర్‌పోర్టులో గిఫ్ట్‌ ఆగిపోయిందని, కొద్దిపాటిగా ఫీజు చెల్లించాలని చెబుతూ డబ్బులు వసూలు చేస్తారు. అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, ప్రమాదం జరిగిందని చెప్పి డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడతారు. పెట్టుబడులు చేస్తే భారీ లాభాలు వస్తాయని ఇన్వెస్టిమెంట్‌ మోసాలు చేస్తుంటారు. వ్యక్తిగత ఫొటోలు వీడియోలు తీసుకుని మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. నకిలీ పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో పని చేస్తుంటామని స్నేహం పెంచుకుని కూడా మోసాలకు పాల్పడుతుంటారు.

అప్రమత్తతే ప్రధానం

సైబర్‌ నేరాల పట్ల మోసపోకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిచయమైన అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు. గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు బదిలీ చేయకూడదు. అధికారులు ఎవ్వరు బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు అడగరు అనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement