సంగారెడ్డి జోన్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాత భవనాలను గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను మిషన్ మోడ్‌లో నిర్వహించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


