మరో మహిళకు తీవ్ర గాయాలు
దుబ్బాకటౌన్: విద్యుత్ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయపోల్ మండలంలోని అనాజిపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి (55) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. బుధవారం గ్రామానికి చెందిన రాచకొండ యాదగిరి పొలంలో నాట్లు వేసేందుకు లక్ష్మితో పాటు పలువురు మహిళా కూలీలు వెళ్తున్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు విద్యుత్ తీగలు తగిలి కరెంటు సరఫరా అవుతుంది. గమనించని లక్ష్మి ఫెన్సింగ్‌ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయింది. ఆమెతో పాటు మరో మహిళ పోచవ్వకు కూడా షాక్ తగిలింది. గమనించిన తోటి కూలీలు, స్థానికులు ఇద్దరినీ గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన పోచవ్వకు చికిత్స అందిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి..
రామచంద్రాపురం(పటాన్ చెరు): గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రామచంద్రాపురం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఈనెల 26న గుర్తుతెలియని వ్యక్తి (60) ఏళ్ల వయస్సు గల వృద్ధుడు ఫిట్స్ రావడంతో కిందపడి అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో స్థానికులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా వైద్య సిబ్బంది వద్ద అతని పేరు జాఫర్ అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


