జహీరాబాద్: మండలానికి ఒక రైతు వేదిక చొప్పున ఎంపిక చేసి సీడ్ మేళా నిర్వహించారు. సోమవారం జిల్లాలోని ఆయా మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సైతం ఈ మేళాలు కొనసాగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన కారణంగా రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు మేళాలు నిర్వహించనున్నారు. పలు రకాల కూరగాయల విత్తనాలతో పాటు స్వీట్‌కాన్ మొక్కజొన్న విత్తనాలను డీలర్లు రైతులకు అందుబాటులో ఉంచారు. విత్తనాలు లభించని రైతులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా వ్యవసాయ శాఖ సీడ్ మేళాను ఏర్పాటు చేసింది. జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సీడ్ మేళాకు పలువురు రైతులు హాజరై విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓ సరస్వతి పాల్గొన్నారు.


