కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కోరినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం తెలిపారు. ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు.
మెదక్‌జోన్: బాలిక వెంటపడి పెళ్లి చేసుకుంటానని వేధించిన నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు ఇలా.. శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 ఫిబ్రవరిలో చాకలి కుమార్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఇంటర్ చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి శుభవల్లి నిందితుడికి ఏడాది జెలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు వాడుకున్న వారి నుంచి రికవరీ చేయాలని మాజీ ఉప సర్పంచ్ నర్సింలు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా రూ.16 లక్షల ఆదాయం వచ్చిందని, ఆ డబ్బులు మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి వద్ద రూ.11 లక్షలు, రాంచంద్రా రెడ్డి వద్ద రూ.5 లక్షలు గ్రామస్తుల సమక్షంలో ఉంచినట్లు ఆరోపించారు. కాగా గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉన్నా.. డబ్బులు అడిగితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ప్రజా అవసరాలకు ఖర్చు చేయాల్సిన డబ్బులను వారి సొంతానికి వాడుకున్న వారిపై చర్యలు తీసుకొని, డబ్బులు రికవరీ చేయాలని పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.
గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని కొడకండ్లలోగల పెద్దమ్మతల్లి దేవాలయంలో చోరీ జరిగింది. గ్రామస్తుల వివరాలు.. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ముక్కుపుడకతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. కాగా సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సదాశివపేట(సంగారెడ్డి): మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపి పట్టుబడటమే కాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం.. ఈనెల 22న వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దాపురం రవీందర్ పట్టుబడ్డాడు. కాగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి లక్ష్మికళ అతడికి నాలుగు రోజుల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.


