మంజీరా తీరంలో అలజడి | - | Sakshi
Sakshi News home page

మంజీరా తీరంలో అలజడి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

సాగు మోటార్లకు కరెంటు నిలిపివేత

మంత్రి జోక్యంతో పునరుద్ధరించిన అధికారులు

పుల్‌కల్‌(అందోల్‌): మంజీరా నది తీరంలో ‘సాగు’ మోటార్‌లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. మంజీరా నది పరివాహకంలో నీటి కొరత ఏర్పడటంతో సాగుకోసం రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్‌లకు సోమవారం విద్యుత్‌ అధికారులు కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తాగునీటి పథకాలకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అధికారులు తీరం వెంబడి ఏర్పాటు చేసిన మోటార్‌లకు విద్యుత్‌ సరఫరాను తొలగించారు. పోలీసులు, విద్యుత్‌ అధికారులు సింగూరు డ్యాం దిగువ నుంచి ఘనపూర్‌ ఆయకట్టు వరకు వేలాది సాగు మోటార్‌లకు విద్యుత్‌ సరఫరాను తొలగించారు. దీంతో రైతులు మూకుమ్మడిగా రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహకు సమాచారం అందించారు. దీంతో మంత్రి జోక్యం చేసుకుని విద్యుత్‌ మోటార్‌లకు సరఫరాను పునరుద్ధరింపజేశారు.

నాట్లు పూర్తి..

మంజీరా నదీ పరివాహకంలో పుల్‌కల్‌, చౌటకూర్‌, సదాశివపేట, హత్నూర, చిలిప్‌చెడ్‌, అందోల్‌, చౌటకూర్‌ మండలాలు, పాపన్నపేట, కొల్చారం, మండలాలకు చెందిన తీరం గ్రామాల్లో వేలాది సాగు మోటార్‌లను అమర్చి సేద్యం చేస్తున్నారు. నదిలో పుష్కలంగా నీరు లభిస్తుండటంతో కరువు కాలంలో కూడా తీరం వెంబడి పుష్కలంగా పంటలు పండిస్తారు. అధికారులు సోమవారం సాగు మోటార్‌లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీరం వెంబడి పంటలు పండించొద్దని జూన్‌ ప్రారంభంలో అధికారులు సూచిస్తే వరినాట్లు వేయకుండా ఉండేవారమని రైతులు మంత్రి దామోదరకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement