యువకుడి ఆత్మహత్య
సిద్దిపేటకమాన్: వివాహం కావడం లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం కోమటిచెరువులో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నాసర్‌పూరకు చెందిన మిద్దె చందు (30) కొంత కాలంగా కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా యువకుడికి కొద్ది రోజుల క్రితం కంటికి పూత వచ్చింది. ఆ సమస్య పెద్దది కావడం, ముప్‌పై ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి స్థానిక కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనంతగిరిపల్లిలో వివాహిత..
వర్గల్(గజ్వేల్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని అనంతగిరిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మల మహేశ్, శిల్ప(25) ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏమి జరిగిందో తెలియదుగాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిల్ప బెడ్రూమ్‌లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె మృతికి భర్తే కారణమంటూ మృతురాలి సంబంధీకులు, కుటుంబీకులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సమాచారం తెలిసి తొగుట సీఐ లతీఫ్, పలువురు ఎస్‌ఐలు, పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా, మృతురాలి భర్త మహేశ్‌పై దాడి జరగకుండా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారకులెవరైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మృతురాలి సంబంధీకులకు సీఐ నచ్చజెప్పారు. శిల్ప మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తొగుట సీఐ తెలిపారు.


