పెట్రోల్ బాటిల్‌తో తండ్రి ఆందోళన
జహీరాబాద్: ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం టీసీ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థి తండ్రి ఆ పాఠశాల ఎదుట పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోహీర్ మండలంలోని చింతలగట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెండేళ్లుగా తన కుమార్తెను జహీరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ స్కూలులో చదివిస్తున్నాడు. కాగా ఏప్రిల్‌లోనే తన కుమార్తె టీసీ ఇవ్వాలని ముందస్తుగానే లిఖిత పూర్వకంగా విన్నవించినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం టీసీ కోసం వెళ్తే వారం రోజులు సమయం పడుతుందని, పాఠశాల బాధ్యులు సమాధానం ఇచ్చారన్నారు. దీంతో విధిలేక పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. శుక్రవారం టీసీ కోసం సంబంధిత విభాగంలో అడగగా సోమవారం ఇస్తామని చెప్పి పంపించామన్నారు. సోమవారం పాఠశాలకు రాగా సాయంత్రం తీసుకెళ్లమని సూచించగా, నిరసనకు దిగాడని తెలిపారు. పాఠశాలలో ఇప్పటి వరకు ఎవరి టీసీలను ఆపలేదని వారు స్పష్టం చేశారు.


